భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి .ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల, పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు.
వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ, భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు." నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని, ప్రాచీన గ్రంథాలైనశిలప్పాధికారం, భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది.
క్రీ.శ 12వ శతాబ్దం వరకూ భారతదేశమంతటా ఒకే రకమైన సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. తరువాత ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వీరు క్రీ.శ. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు పరిపాలించారు. వీరి కాలంలో ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంగీతం పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితమైంది.
14వ శతాబ్దం వచ్చే సరికి ఈ సాంప్రదాయ సంగీతం, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం అని రెండుగా చీలిపోయాయి. 18వ శతాబ్దం నుంచీ, 20వ శతాబ్దం వరకూ ఈ సంగీతాన్ని మైసూర్ మహారాజులు, ట్రావెంకూర్ మహారాజులు ఎక్కువగా ఆదరించి పోషించారు.వేంకటమఖి మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొని, దానిని తన సంస్కృత గ్రంథం, "చతుర్దండి ప్రకాశిక"లో పొందుపరిచాడు. నేడు వాడుకలో నున్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేసింది గోవిందాచార్య. ట్రావెంకూర్, మైసూర్ రాజులు, సంగీతకర్తలే కాక, వీణ, రుద్రవీణ, వేణువు, వయొలిన్, ఘటం, మృదంగం వంటి వాయిద్యాలలో నిష్ణాతులు. వారి ఆస్థాన సంగీత విద్వాంసులలో పేరెన్నిక గన్నవారు వీణా శేషన్న (1852 - 1926), వీణా సుబ్బన్న (1861 - 1939) లు.
స్వాతంత్ర్యానంతరం, కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు.అలా మద్రాసు కర్ణాటక సంగీత కేంద్ర బిందువుగా వెలసింది. ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది.
హిందుస్థానీ సంగీతం పర్షియన్, ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీత దిశానిర్దేశక విషయ ప్రస్తావన వస్తే రామామాత్యుడు మొదలుకొని, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య ఇలా ఒకరేమిటి ఎంతో మంది తెలుగు వారు తమ సర్వస్వాన్నీ సంగీతానికి ధారపోశారు. ఈనాడు కర్ణాటక సంగీతం సశాస్త్రీయంగా, శుద్ధంగా ఉండడానికి కారణం వీరే.
ఎందరోమహానుభావులు రచించిన కీర్తనలను ,వాటి విసిష్టతను నా ఈ బ్లాగ్ లో పోదు పరచాలనే ఆలోచనతో మొదలు పడుతునాన్ను ...
*ఎందరోమహానుభావులు అందరికి వందనాలు*
*మీ ఉషగిరిధర్*
No comments:
Post a Comment