Thursday, August 26, 2021

గానవిద్యా వారిధి -1

  *శ్రీ గురుభ్యో నమః*

                 దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీత దిశానిర్దేశక విషయ ప్రస్తావన వస్తే రామామాత్యుడు మొదలుకొని, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య ఇలా ఒకరేమిటి ఎంతో మంది తెలుగు వారు తమ సర్వస్వాన్నీ సంగీతానికి ధారపోశారు. 

           ఈనాడు కర్ణాటక సంగీతం సశాస్త్రీయంగా, శుద్ధంగా ఉండడానికి కారణం వీరే. వీరందరి పేర్లు మనకి సుపరిచితమే. 

           కానీ నిశ్శబ్దంగా, నిర్విరామంగా సంగీతానికి తొంభయ్యేళ్ళకి పైగా కృషి చేసిన ఒక మహానుభావుడి గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

                 ఆ మహా మనీషి డా. శ్రీపాద పినాకపాణి గారు .

              రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి (ఆగష్టు 3, 1913 - మార్చి 11, 2013). నూరేళ్ళ సంగీతయానం ఆయనది. వృత్తి రీత్యా వైద్యుడయినా సంగీతజ్ఞుడినని చెప్పుకోవడానికే ఇష్టపడే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. 

          ఆయన కేవలం గాయకుడే కాదు; కేవలం వైణికుడే కాదు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆపోశన చేసిన వాగ్గేయకారుడు. సంగీతమూ, విజ్ఞానమూ పదిమందితో పంచుకున్నప్పుడే అది పదికాలాలపాటూ నిలుస్తుందని నమ్మిన ఆయన ఎంతో మంది శిష్యుల్ని ఆణి ముత్యాలుగా మలిచారు. 

               సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వేంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది బ్రదర్స్, ప్రసిద్ద సినీ గాయని ఎస్. జానకి, ఇలా ఎందరో మహామహులు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. 

వారందరూ శ్రీపాద వారి గురించి అనే ఒకే మాట 
 " ఆయన గురువులకే గురువని."

          శ్రీపాద పినాకపాణి ఆగస్ట్ 13, 1913న శ్రీకాకుళంలో ప్రియాగ్రహారంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. తండ్రి కామేశ్వరరావు, మైసూర్ బి. లక్ష్మణరావు గార్ల వద్ద 11వ యేట మొదటి పాఠాలు నేర్చుకున్నారు.

 ఆయన నేర్చుకున్న మొదటి కృతి గజానన సదా. ఆ వయసులోనే ఆ కృతికి స్వరరచన చేసిన శ్రీపాద ఆ తరువాత ఎన్నో కృతులకు తనదైన పద్ధతిలో స్వరరచన చేసుకొని నేర్చుకున్నారు.

 ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు, శ్రీరంగ రామానుజ అయ్యంగార్ల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో ప్రావీణ్యత సాధించారు. 

 1938లో ఆంధ్రా యూనివర్శిటీ మెడికల్ కాలేజీనుండి వైద్యంలో పట్టా తీసుకున్నారు. ఈయనకి రాగాలు కట్టాలన్నా, రోగాలు కట్టాలన్నా  ఒకటే మక్కువని అప్పట్లో అందరూ అనుకునేవారట.

                              సంగీతంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో, మద్రాసు సంగీత సభ వారు సంగీత కళానిధి బిరుదుతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో సత్కరించారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఆయనకు స్వర్ణకంకణాన్నీ, గానవిద్యా వారిధి బిరుదునూ ఇచ్చి, ఆయన గౌరవార్థం కర్నూలులో శత జయంత్యోత్సవ వేడుకలు నిర్వహించారు.

                🙏ఎందరోమహానుభావులు అందరికి వందనాలు🙏


No comments:

Post a Comment