Thursday, August 26, 2021

గానవిద్యా వారిధి -2

*శ్రీ గురుభ్యో నమః*
మన పూర్వీకులు సంగీతాన్ని రెండు రకాలుగా విభజించారు. 
మొదటిది మార్గ సంగీతం – అంటే భరతముని ప్రవచించిన సంగీత పద్ధతి.
రెండోది దేశీయ సంగీతం – దేశకాల సంబంధమైన జనరంజక సంగీతం. ప్రస్తుతం మన సంగీతాన్ని దేశీయ సంగీతమనే వ్యవహరిస్తాం.


జనరంజకమయిన పాటకు కూడా ఒక మార్గము, పద్ధతి ఉంటాయి. కూనిరాగం కావచ్చు, లేదూ జానపదం, శాస్త్రీయం కావచ్చు; ఏ పాట అయినా, లయబద్ధమై ఉంటుంది. పాటకి లేదా శబ్దానికి ఆ లయకు తోడుగా, రూపం, నడక కలిసినప్పుడు అది జనరంజకం అవుతుంది. ఆ శబ్దప్రకరణాన్నే రాగం అన్నారు. అంటే వివిధ శబ్దాలను ఒక పద్ధతిలో ఒక నడకకి నప్పితే అదొక రాగం అవుతుంది. ఇక్కడ శబ్దం అంటే స్వరంగా భావించాలి. 

                      మన పూర్వీకులు అలా పొడిపొడి శబ్దాలు లేదా స్వరాల నడకకి సరైన మాటలు లేదా పదాలు అమర్చీ, వారికిష్టమైన భావాలు ఆయా పదాల్లో చొప్పించీ పాడేవారు. దీన్నే గీతం లేదా పాట అనేవారు. ఈ పాట ఒకరి నుంచి మరొకరికి వినికిడి ద్వారానో లేదా అనుసరణ ద్వారానో చేరేది. ఇటువంటి చక్కని గీతాన్నే సంగీతం అన్నారు. సంగీతం అంటే సమ్యక్ గీతం – అంటే ఒక చక్కని పాట.

               సంగీత శాస్త్రానికి ప్రథమంగా శార్ఙ్గదేవుడు సంగీత రత్నాకరం రచించి ఒక పద్ధతిని సూచించాడు. తరువాతి కాలంలో రామామాత్యుడు తాను వ్రాసిన ‘స్వరమేళ కళానిధి’ లో రాగ లక్షణాలను బట్టి వాటిని ఒక శాస్త్రీయపద్ధతిలో కూర్చడానికి ప్రయత్నించాడు. తరువాత వేంకటమఖి ఆ ప్రతిని సరిదిద్ది, కొత్త ప్రతిపాదనలు చేస్తూ 72 మేళకర్తరాగ విభజన చేసి సంగీతానికి ఒక శాస్త్రీయత చేకూర్చాడు. ఈ పద్ధతినే ప్రస్తుతం మనం అనుసరిస్తున్నాం.

              ఇదంతా 16, 17 శతాబ్దాల్లో జరిగింది. రాగవిభజన చేసి సంగీతానికి ఎంత శాస్త్రీయత చేకూర్చినా, వాగ్గేయకారుల రచనలు మాత్రం గురుముఖంగానే నేర్చుకోవల్సి వచ్చేది. ఈ క్రమంలో కృతీ, వర్ణమూ వంటివి అటూ ఇటూగా రూపాంతరం చెందేవి. ఏది సరైనదన్న ఒక నిర్ధారణకి రాలేక సంగీతజ్ఞులు సందేహంలో మునిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

           కాలక్రమేణా సంగీతంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యమైన మార్పు ఏమిటంటే పాటకి రాగాన్ని అనుసరించి స్వరం రాయడం. దీన్నే మనం స్వరరచన (Notation) అని అంటాం.

        మన పూర్వీకులయిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలు స్వరరచన లేకపోవడం, స్వరాలు తెలియకపోవడం వలన పాట తీరూ, రూపమూ తెలుసుకోవడం కష్టమవుతుంది.

 ఇలా నొటేషను లేకుండా ప్రస్తుతం మనకి లభించిన అనేక క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, అన్నమయ్య సంకీర్తనల వంటివాటికి ఆ వాగ్గేయకారులు ఎలా స్వరపరిచారో, ఏ విధంగా పాడేవారో తెలియకుండా పోయింది. అప్పటికీ, ఇప్పటికీ రాగాల పేర్లలో మార్పులు రావడంతో ఈ ప్రయత్నం మరింత కష్టతరమయింది. ఈ కారణాల వల్ల అనేక సంగీత రచనలు మరుగున పడిపోయాయి.

                 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన మధ్యనే ఉంటూ ఇటువంటి సంగీత రచనలనీ ఏర్చి కూర్చి, వాటికి వాగ్గేయకారులు నిర్దేశించిన రాగాల్లో స్వరాలు వ్రాసి, వాటిని ముందు తరాలకి అందించిన శ్రీపాద పినాకపాణిగారి బృహత్కార్యాన్ని పరిచయం చెయ్యడం కోసం. ఒకటీ రెండూ కాదు, 1000 పైచిలుకు వాగ్గేయకారుల కృతులకి స్వరరచన చేసి ఒక చోట పుస్తకంగా అచ్చు వేయడానికి ఒక జీవితకాలం కావాలి.శ్రీపాద తన జీవితకాలాన్ని ఇందుకే వెచ్చించారు.( అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..)


                    కర్ణాటక సంగీతానికి పినాకపాణి వారు అందించిన విలువైన కానుకలు ఆయన రాసిన పుస్తకాలు: పల్లవి గాన సుధ, మేళరాగమాలిక, మనోధర్మ సంగీతం, సంగీత సౌరభం (నాలుగు సంపుటాలు). కొద్దికాలం క్రిందట ప్రచురించబడిన స్వరరామం, అభ్యాసం, ప్రపత్తి అనే మూడు పుస్తకాలు సంగీత విద్యార్థులకి ఎంతో ఉపకరించేవి.


             ఇవి కేవలం పుస్తక రూపేణా అందించిన సంగీత రచనలు. ఇవికాక స్వరాలు లభ్యంకాని ఎన్నో కృతులకు సశాస్త్రీయంగా రాగ బద్ధంగా కూర్చిన స్వరరచనలు మరికొన్ని మచ్చుతునకలు. అన్నింటికన్నా గొప్ప విషయం తన వద్దకి వచ్చినవారికి కాదనకుండా సంగీతం నేర్పడం; తనకున్న సంగీత జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించడం. విశాల హృదయం ఉంటే తప్ప నిష్కల్మషంగా సంగీత బోధన జరగదు. ప్రముఖ వైణిక విద్వాంసురాలు మేడూరి సుబ్బలక్ష్మి కర్నూలులో ఆయన వద్ద మూడేళ్ళు సంగీతం నేర్చుకున్నారు.

                     “త్యాగరాజునీ, దీక్షితారునీ, శ్యామశాస్త్రినీ నేను చూడలేదు. వాళ్ళ పాటలు వినడమే తప్ప వ్యక్తిగతంగా మనకి వారు తెలియదు. పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. చాలా మంది గురువులు సంగీత పాఠం చెబుతారు. పినాకపాణిగారు మాత్రం అలా కాదు. నేర్చుకునే వారికి అది సంపూర్ణంగా, క్షుణ్ణంగా వచ్చే వరకూ తాపత్రయపడతారు. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది.  అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు. గురువంటే ఇలా ఉండాలి అన్న దానికి ఆయనే ఒక పెద్ద నిర్వచనం,” అని పినాకపాణి గారి గురించి మేడూరి సుబ్బలక్ష్మి అంటారు.

🙏ఎందరోమహానుభావులు అందరికి వందనాలు🙏



No comments:

Post a Comment