శ్రీ గురుభ్యో నమః
ఆ స్వరం దేవదేవుని మేలుకొలుపు.
ఆ రూపం భారతీయతకు నిండుజాబిలి.
పారవశ్యభక్తితత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం.
ఆమే.. సంగీత కళానిధి, సంగీత సరస్వతి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు.
ఈ రోజు ఆ గాత్రం పుట్టినరోజు (సెప్టెంబరు 16వ) .
ఆమె అసలు పేరు మదురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబర్ 16న మదురైలో జన్మించారు. ఎంఎస్ తల్లిదండ్రులు సుబ్రమణ్య అయ్యర్, షణ్ముగ వడివు అమ్మాల్. కర్ణాటక సంగీత శాస్త్రీయ, ఆర్థశాస్త్రీయ గీతాలాపనలో నేటికి ఆమెకు సాటిరారు ఏనాటికి అనేవిధంగా ఆమె గాత్రం అజరామరంగా సాగింది. చిన్నవయస్సుల్లో ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకున్న ఎంఎస్ అతిపిన్న వయస్సులోనే ఆమె ఆది గురువైన తల్లి షణ్ముగ వడివు ద్వారా సంగీత ప్రస్థానం మొదలు పెట్టారు.
సుబ్బులక్ష్మి గారు సంగీత తరంగమే కాదు.. వెండితెర వెలుగు కూడా. పదేళ్ల వయస్సు నుండే కచ్చేరీలు ప్రారంభించారు. ఆమెలో భక్తి బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రమణ్య అయ్యరే అని చెప్పుకోవచ్చు. చిరుప్రాయం నుండే సంగీత సరస్వతిగా పిలువబడిన ఎంఎస్ 1938లో సినీ సంగీతంలోకి అడుగు పెట్టారు. 'సేవాసదనం' అనే చిత్రం ద్వారా సినీ గాయకురాలిగా పరిచయం అయిన సుబ్బులక్ష్మి 1940లో 'శకుంతలై' అనే చిత్రంలో గాయకురాలిగా తెరపై కనిపించారు. అంతేకాదు 1945లో "మీరా" అనే చిత్రంలో మీరాబాయిగా నటించి జాతీయ గుర్తింపు పొందారు. ఇందులో ఆమె నటనకు ప్రపంచస్థాయి ప్రశంసలు అందాయి.
తన ఎదుగుదలకు అంతా తన భర్త సదాశివమే కారణమని ప్రతి మాటకు ముందు చెప్పేవారు సుబ్బులక్ష్మి.
ఎక్కని స్టేజిలేదు.. పాడని కృతిలేదు.. పొందని పురస్కారం లేదు.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఆమె స్వరానికి నీరాజనాలు పట్టాయి. అలాగే ప్రపంచ కర్ణాటక సంగీతంలో మ్యూజిక్ అకాడెమీచే సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రపుటలకెక్కారు. ఫిలిప్పైన్ ప్రభుత్వం రామన్ మెగసెసె అవార్డు కూడా అందించింది. అలాగే ఎస్వీ విశ్వవిద్యాలయంతోపాటు పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.
ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందారు సుబ్బులక్ష్మి.
కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం.
త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
నేటికీ ఏనాటికి ప్రతి ఇంటా తెల్లవారు జామునుంచే "కౌశల్యా సుప్రజా రామా" అంటూ ఎంఎస్ స్వరం సంగీత జల్లులు కురిపిస్తూనే ఉంటుంది. ఇదే సంగీత కళానిధికి అందిస్తున్న జయంతి నివాళి. 🙏🙏
ఐక్య రాజ్య సమితిలో ఎం స్ :

No comments:
Post a Comment