Tuesday, September 7, 2021

గానవిద్యా వారిధి -4

        *శ్రీ గురుభ్యో నమః*           

 "మేళరాగమాలిక" పినాకపాణిగారి మరో ఉత్కృష్టమయిన సంగీత రచన. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా ఉన్న 72 మేళకర్త రాగాలతోనూ చేసిన రాగమాలిక. ఈ 72 రాగాల మేళరాగమాలిక మొదట రచించింది మహావైద్యనాథయ్యర్. పినాకపాణిగారి పుస్తకంలో అసలు ఈ రాగమాలిక ఎలా పాడాలీ, ఏ ఏ రాగాలు పాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ, శ్రద్ధా తీసుకోవాలీ అన్న విషయాలు ఎంతో వివరంగా, సులభంగా అర్థం అయేట్టుగా ఉంటాయి.ఈ మేళరాగమాలిక పాడటం ఒక దుస్సాధ్యమనుకునే వారికి పినాకపాణిగారి వివరణ ఒక వరం లాంటిది. 

         అలాగే, కర్ణాటక సంగీతంలో అతి క్లిష్టమయిన ప్రక్రియ రాగం-తానం-పల్లవి లోని పల్లవి సంప్రదాయం గురించి పల్లవి గాన సుధ పుస్తకంలో చర్చించారు.ఇందులో కొన్ని పల్లవులు వీరి శిష్యులు నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సూరిబాబు, తదితరులు వారి కచేరీల్లో పాడేవారు.


కేవలం సంగీతానికి సంబంధించిన పుస్తకాల రచనే కాకుండా ఆయన స్వయంగా ఎన్నో కృతులకి స్వరాలు కట్టారు. 

అన్నమయ్య, క్షేత్రయ్య పదాలకు ఎన్నిటికో ఆయన స్వరరచన చేశారు. పినాకపాణిగారే కొన్ని కృతులు, వర్ణాలు కూడా రచించారు. ఈ క్రింది ‘మనసిజ’ హిందోళ వర్ణం, భజగోవిందం వంటివి ఈయన చేతులమీదుగా స్వరాలు దిద్దుకున్నవే!

            స్వతహాగా వైద్యులు కావడం వలన రోగానికి కారణం వెతికినట్లే, సంగీతం ఎలా నేర్పాలి, ఎలా నేర్పితే సులభతరం అవుతుంది అన్నవి ఎంతో ఆలోచన పెట్టి పరిశోధన చేసిన పినాకపాణిగారికి ‘గురుర్బ్రహ్మా – గురుర్విష్ణుః – గురుర్దేవో మహేశ్వరః’ అన్న సూక్తి అక్షరాలా వర్తిస్తుంది.

              అంకెలని కూడా మేలకర్త రాగ అంకెలతో (నంబర్స్) అనుసంధానం చేస్తూ ఉండేవారు. తన టెలిఫోన్ నంబరు - రత్నాంగీల నడుమ, రెండు చారుకేశులు అని, కారు నెంబరు 3654 - చక్రవాల శంకరాభరణం అని చమత్కరించారు.

అంతటి మహోన్నతమైన వ్యక్తి గురించి ఎంత రాసిన తక్కువే...............

 *ఎందరోమహానుభావులు అందరికి వందనాలు*🙏🙏


No comments:

Post a Comment