అదెంత పుణ్యభూమి!
ఆ ఊరెంత ధన్యచరిత్ర!!
అక్కడి ప్రతిశిలకీ ’సాలగ్రామ’ వైభవమే...
అక్కడి ప్రతి ఇసుక రేణువూ శివలింగమే...
లేకపోతే...సంగీత ప్రపంచంలో మూర్తి త్రయంగా పేరుపొందిన ముగ్గురూ
ఆ ఊళ్ళోనే పుట్టడం ఏమిటి!!
అదే పరమెశ్వరుడి లీల!
ఆ ఊరిపేరు - తిరువారూరు...
అక్కడే త్యాగరాజస్వామివారూ....శ్యామశాస్త్రిగారూ
ముత్తుస్వామి దీక్షితులవారూ పుట్టారు....
అదో త్రివేణి సంగమం...
తిరువారూరులో వెలిసిన శివుడిపేరు ‘త్యాగరాజు’
ఆ పేరే త్యాగరాజస్వామి వారికి పెట్టింది!!
1775 మన్మథనామ సంవత్సరం(24th March)
ఫాల్గుణ మాసం...త్యాగరాజస్వామివారి ఉత్సవాలు జరుగుతోన్న సమయంలో...కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు శ్రీముత్తుస్వామి దీక్షితులు....
ముత్తుస్వామి దీక్షితుల తండ్రి కూడా సామాన్యుడేం కాదు. పేద్ద సంగీత విద్వాంసుడు. తంజావూరు ప్రభువుల మన్నన పొంది స్వయంగా ‘హంసధ్వని రాగాన్ని’ కనిపెట్టిన దిట్ట...
ఆయన పేరు రాజస్వామి దీక్షితులు...భార్యపేరు సుబ్బలక్ష్మి అమ్మాళ్...చాలాకాలం వాళ్ళకి సంతానం కలక్కపోతే...
చిదంచరస్వామి అనే సన్యాసి అజ్ఞ మేరకు తంజావూరులోని వైదీశ్వరణ్ కోవెలకు వెళ్ళి నలభై రోజులు పూజలూ పునస్కారాలూ చేయడం వల్ల...
అమ్మవారు ఒక ముత్యాల హారం ఇచ్చినట్టు స్వప్నం వచ్చిందట..
తరవాత పుత్రసంతానం కలిగింది....
వైదీశ్వరన్ కోవెలలోని కుమారస్వామి పేరు ముత్తుస్వామి...(ముత్తు అంటే తమిళంలో ముత్యం అది ఉత్తరోత్తర..ముత్తుస్వామి దీక్షితులు అయ్యింది....
మాతృభాష తమిళం అయినప్పటికీ ముత్తుస్వామి సంస్కృతం, తెలుగులో కూడా పాండిత్యం సంపాదించాడు...
అందుకే ఆయన కొన్ని కీర్తనలను మూడు భాషలూ కూర్చి...మణిప్రవాళ భాషలో రాసాడు... ‘మణిప్రవాళం’ అంటే మణులూ - పగడాలు కలిపిన అని అర్థం...
ఇలా సంగీతంలోనూ సాహిత్యంలోనూ అపారమైన పాండిత్యం సంపాదించుకున్న ముత్తుస్వామి దీక్షితులు..
ఒకసారి తండ్రిగారి స్నేహితుడైన వెంకటకృష్ణ మొదలియార్ తో కలిసి మద్రాసులోని జార్జికోటకి తీసికెళ్ళడం..
అక్కడ ఇంగ్లీఘ బ్యాండు వినీ దానిపట్ల ఆకర్షితుడై....పాశ్చాత్య సంగీతంలోని మర్మాలను కూడా ఆకళింపు చేసుకుని...
కొన్ని ఆంగ్ల ట్యూన్లకు సంస్కృత సాహిత్యాన్ని సమకూర్చాడు!...
అలాంటివి దాదాపు యాభై చేసారట...!!
అందులొ ముఖ్యమైనది.. తెలుగు నిఘంటువును వ్రాసిన బ్రౌనుదొర కోరిక మేరకు తయారు చేసిన ’గాడ్ సేవ్ ది కింగ్’ అనే ఆంగ్ల జాతీయ గీతానికి సంస్కృత సేత...అయితే అది రాజరికన్ని స్తుతిస్తూ కాకుండా దేవీ పరంగా ఉంది!
"సంతతం....పాహిమాం....సంగీత శ్యామలే
సర్వధారే...జననీ చింతతార్థప్రదే...
చిద్రూపిణీ శివే...!
ఇలా ముత్తుస్వామిదీక్షితుల వారికి పాశ్వాత్య సంగీతంలో పరిచయం అవడం వల్ల దక్షిణ భారత సంగీతానికి ఒక మహోపకారం జరిగింది.
అదేవిటంటే ఫిడేలు మన సంగీత వాద్యం కాదు!! పాశ్వాత్య వాయిద్యం.
అలాంటి ఫిడేలుని ముత్తుస్వామి దీక్షితుల తమ్ముడు...బాలస్వామి దీక్షితులు అభ్యసించి...దాన్ని వాయించి. శభాష్ అనిపించుకున్నాడు!
ఆ కారణంగా ఇవాళ వయొలిన్ దక్షిణ హస్త స్పర్శతో వాయులీనం అయి................
దక్షిణ భారత సంగీతంలో సహకార వాయిద్యంగానూ కొండొకచో ‘సోలో’ వాయిద్యం గానూ...పేరుపొంది...దక్షిణభారత సంగీతంలో ప్రథమాంగమై పోయింది. హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ ఉపయోగించరు!!
ఒకసారి చిదంబర యోగిగారొచ్చి....ముత్తుస్వామి దీక్షితుల తండ్రిగారిని ఒక కోరిక కోరారు....
అదేవిటయ్య అంటే...ముత్తుస్వామి దీక్షితుల్ని తన వెంట..కాశీని పంపించవలసిందీ అని.
రామస్వామి గుండె గుభేలుమంది. రాముణ్ణి వదులుకోబోతున్న దశరథుడై పోయాడు!...
మొదట వద్దన్నాడు....ఎట్టకేలకు మిత్రుడైన వెంకటకృష్ణ మొదలియారు సలహామేరకు అంగీకరించి గురువుగారితో కాశీకి పంపాడు!!
ముత్తుస్వామిదీక్షితులు ఉత్తర భారత దేశయాత్ర ఆరంభమయింది. గురువుగారితో కలసి అనేక పుణ్యక్షేత్రములను సందర్శిస్తూ.....
ప్రతిచోటా ఒక కీర్తన రాయడం ప్రారంభించాడు...కాశీవిశ్వనాథుడి మీద...అన్నపూర్ణ మీద, నేపాల్ లోని పశుపతినాథుని మీద...బదరి నారాయణుడి మీద రచిస్తూ మెల్లిగా హిందుస్తానీ సంగీతం కూడా ఆకళింపు చేసుకుని ‘బృందావనసారంగ’ రాగంలో చాలా కీర్తనలు రాసాడు...
ఒకరోజు గురువుగారు...కాశీలోని గంగానదిలో స్నానం చేస్తూ...శిఘ్యణ్ణి పిలిచి....
"ముత్తుస్వామి నాకు పరమేశ్వరుడినించి పిలుపొచ్చింది!....నేను వెళ్తున్నాను" అంటూ...
"నీకు కాలికేదైనా తగిలితే తీసుకో" అని చెప్పి...తను ప్రాణత్యాగం చేసారు!
చిత్రంగా ముత్తుస్వామి దీక్షితుల కాలికి ఒక వీణ తగిలింది! దాన్ని గురు వరప్రసాదంగా భావించి కళ్ళకద్దుకుని....గురువు శివైక్యం చెందటంతో హృదయం గాయమై....ఆ వీణతో పాటు కాశీ నగరాన్నించి మళ్ళీ స్వగ్రామానికి ప్రయాణమయ్యాడు...ముత్తుస్వామి.
మనసేమి బాగోక....తమిళనాడులోని తిరుత్తణి వెళ్ళి షడక్షరీ జపం చేస్తూ ఒక మండలం రోజులు గడిపాడు...
ఒక మధ్యాహ్నం పూట....తన్మయత్వంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి స్తూతిస్తూ ఉండగా...జటాధారియైన ఒక వృద్ధుడొచ్చి...
"ముత్తుస్వామి!!
నోరు తెరువు నాయనా" అని పిలిచి నోట్లో పటిక బెల్లం వేసి అంతర్థానమయ్యాడట.
ఆ వచ్చింది తన ఆరాధ్యదైవమైన సుబ్రహ్మణేశ్వరుడని గ్రహించి....కళ్ళనీళ్ళ పర్యంతమై ‘గురుగుహ’ అంటూ కృతులని అలపించడం మొదలెట్టాడు.
అది మొదలు ముత్తుస్వామిదీక్షితుల ముద్ర "గురుగుహ" అయ్యింది. ఇంతాచేస్తే...అప్పటికి ముత్తుస్వామి వయస్సు....పాతికేళ్ళే!
ఆ తర్వాత వివాహం జరిగినా....సంసారం పట్ల పెద్ద ఆసక్తిలేని ముత్తుస్వామి...దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ తిరుపతి వేంకటేశ్వరుని మీద...కాళహస్తీశ్వరుని మీద కృతులు రాసి....శివకేశవ అభేదాన్ని కూడా పాటించాడు...
అన్నిటికన్నా విశేషం ఏమిటంటే ముత్తుస్వామి శిఘ్యడు శుద్ధమంగళం తంబియప్ప ఏదో శూలనోప్పితో బాధపడుతుంటే...ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపొయేసరికి జ్యోతిఘ్యలు గురు, శనిగ్రహ దోషం ఉండటం వల్ల అతనికి జబ్బు చేసిందని చెప్పగా...
గురుగ్రహం మీద ఆఠాణ రాగంలో - ‘బృహస్పతీ’ అనే కృతీ.
శనిగ్రహం మీద యదుకుల కాంభోజి రాగంలో ‘దివాకర తనూజం’ అనే కీర్తనలు రాయగా - ఆ శూల నయం అయిందట.... అందువల్ల అయన నవగ్రహాల మీద కీర్తనలు రాయడం జరిగింది....అవి చాలా ప్రాచుర్యం పొందాయి కూడా..
ముత్తుస్వామి దీక్షితులు జీవితంలో మరొక విశేషం ఏమిటంటే సంగీత జగద్గురువు శ్రీత్యాగరాజస్వామి గారు రామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా అనేక మంది ప్రముఖులను పిలుస్తూ....ముత్తుస్వామిగారు కూడా ఆహ్వానించాడు.
సంగీత ప్రపంచంలో సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ మనోజ్ఞ ఘట్టం...త్యాగరాజస్వామివారి నివాసం శ్రీరామ పంచాయతనం ముందు అర్ధ్రంగా....త్యాగరాజస్వామి శిష్య బృందంతో భైరవిరాగంలో ‘కొలువై ఉన్నాడే’ అన్న కీర్తన పాడటం...
దీక్షితులుగారు వెంటనే స్పందించి ‘మణిరంగు’ రాగంలో ‘మామవ...పట్టాభిరామ’ అని కీర్తన పాడటం...విన్న వాళ్ళంతా తరించడం....దాన్ని మళ్ళీ మనం స్మరించడం...
ఎంత మధురానుభూతి....
చివరకి దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శనంలో భాగంగా ముత్తుస్వామి ‘శబరిమల’ కూడా వెళ్ళి అక్కడ అయ్యప్పని దర్శించి వసంతరాగంలో ‘హరిహరపుత్ర’ అని గానం చేసారు.
కర్ణాటక....హిందుస్తానీ...పాశ్వాత్య సంగీతంలో...సంగీత ప్రపంచంలో చిరకీర్తి - సంపాందించుకుని తన తండ్రి గారి సృష్టి అయిన ’హంసధ్వని’ రాగంలో ‘వాతాపి గణపతిం భజే’ లాంటి అపూర్వ ప్రజాదరణ పొందిన కృతి రచించిన ముత్తుస్వామి దీక్షితులు...
ఆశ్వయుజ బహుళ చతుర్థశి నాడు
పున్నాగవరాళి రాగంలో...
‘పాహి అన్నపూర్ణే...సన్నిదేహి సదాపుర్ణే...సువర్ణే...చిదానంద విలాసినీ’ అని గానం చేస్తూ...
‘మీనాలోచన - పాప విమోచని’....అన్న పదమ్ వచ్చేసరికి -
బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని ‘గురుగుహ’ లో ఐక్యమయ్యాడు!!

No comments:
Post a Comment