*శ్రీ గురుభ్యో నమః*
క్షేత్రయ్య పదాలకి కానీ,నారాయణ తీర్థుల తరంగాలు కానీ, అన్నమయ్య పదాలు కానీ, రామదాసు కీర్తనలు కానీ వీటికి సాహిత్యం మాత్రమే ఉంది తప్ప, సంగీతపరంగా స్వరాలు పదిలపరచి లేవు. ప్రతీ పాటకీ కేవలం రాగాల పేర్లు మాత్రమే లభ్యమయ్యాయి. అందువల్ల వారు ఆ పాటల్ని ఎలా స్వరపరిచి పాడారో చెప్పడం సాధ్యం కాదు.
పినాకపాణి వారు ఇటువంటి అనేకమంది వాగ్గేయకారుల సాహిత్యానికి స్వరాలు కూర్చి, సొంతంగా బాణీలు కట్టి పొందుపరిచారు.సంగీత సౌరభం అనే పుస్తకంలో అన్నమయ్య కీర్తనలూ, క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, వర్ణాలూ ఇలా దాదాపు రెండు వేలకి పైగా పాటలకు స్వరరచనను అందించారు.
ఈ ప్రయత్నానికి ఎంతో సహనం, ఓర్పు, శ్రద్ధ, నిబద్ధత కావాలి. తన ముందు తరాలకి పూర్వపు వారందించిన సంగీత సంపద చేరాలన్న తపన వల్లనే ఇది సాధ్యమయింది.
ఆయనే ముందుమాటలో చెప్పినట్లుగా,
“ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య, లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది. అటువంటి కృతులను కనీసం వెయ్యింటినైనా సేకరించి వీలైనంత మట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరాని కందజేయగలిగితే, వారి కృతి సంపదలతో పాటు సంగీత జ్ఞానము, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి అనే ధీమాతో నేను చేసిన ప్రయత్నమీ గ్రంథరచన.”
కేవలం సాహిత్యం ఉన్న పాటలకి స్వరం కూర్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా పూర్వపు వాగ్గేయకారులు నిర్దేశించిన పాటలకి రాగాల పేర్లున్నాయి కానీ స్వరాలు లేవు. అందువల్ల వారు చెప్పిన రాగంలోనే కట్టాల్సి వస్తుంది. వాటిలోని రాగాలు ప్రస్తుతం వాడుకలో ఉండకపోవచ్చు. లేదా మరొక పేరుతో పిలవబడవచ్చు.
ఉదాహరణకి ఎన్నో అన్నమాచార్య కీర్తనల్లో పేర్కొన్న రాగాలు (తెలుగు కాంబోది, కొండమలహరి వంటివి) ప్రస్తుతం లేవు.
అప్పుడు వాడుకలో ఉన్నా అవి ఎలా వుండేవో తెలియదు. అటువంటి సందర్భాల్లో సాహిత్యానికి అనుగుణంగా ఉన్న రాగం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆయా రాగాన్ననుసరించి భావం చెడకుండా సాహిత్యానికి నప్పుతూ స్వరపరచాల్సి ఉంటుంది. ఈ పని చెయ్యాలంటే ముందుగా ఎంతో సంగీతజ్ఞానం కావాలి. రాగాల మీద పట్టు సాధించాలి.
వివిధ వాగ్గేయకారులు రచించిన పాటలకు స్వరాలతో, అనుస్వర, గమక సహితంగా స్వరరచన చేసి పినాకపాణి సంగీత సౌరభంలో పొందుపరిచారు. అందులో కూడా వాడుకలో ఉన్న కొన్ని కృతులలో స్వరస్థానాలని సవరించి వాటిని, విద్వాంసులతో చర్చించి మరీ, సాధికారకంగా ప్రచురించారు.
ఈ సంగీత సౌరభం నాలుగు సంపుటాల్లో మూడు వందలకు పైగా అన్నమాచార్య కీర్తనలను స్వరయుక్తం చేశారు. కొన్ని కృతులు తక్క, అన్నమాచార్య కృతులు ఏఏ రాగాల్లో రాగిరేకుల్లో ఉన్నాయో అవే రాగాలలో వాటికి స్వరాలున్నాయి.
ఉదాహరణకి, అతి ప్రసిద్ధమైన “బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే – తందనానా ఆహి, తందనానా పురే” పదం ప్రస్తుతం మనం బౌళి రాగంలో పాడగా వింటున్నాం.తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య కీర్తనల్లో కూడా బౌళి రాగమనే ఉంది. బాలమురళిగారు మాత్రం భూపాలంలో పాడిన ఈ పాటను పినాకపాణి గారు శంకరాభరణంలో స్వరపరిచారు.
ఈ సంగీత సౌరభంలో ఇంకొక విశేషం కూడా ఉంది.
ప్రతీ సంపుటిలోనూ వచ్చిన రాగాల మీద చివర్లో రాగం ఆరోహణ, అవరోహణ, రాగ సంచారం, విశేష ప్రయోగాలు వంటివి అదనంగా ఇవ్వడం. సాధారణంగా వినికిడి ద్వారానూ, లేదా గురుముఖంగానూ కొంత రాగసంచారం వంటివి అలవాటయినా, ప్రతీ రాగం గురించీ అందరికీ తెలియకపోవచ్చు. సంగీత విద్యార్థులకి కొంచెంగా రాగం తెలిసినా, ఈ పుస్తకంలో ఇచ్చిన దాని తాలూకు సంచారం సాధకం చేస్తే రాగం మీద పట్టు దొరుకుతుంది.
సంగీతం నేర్చుకోవడంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి ఉన్న విద్యార్థులకే కాకుండా, గురువులకు కూడా ఉపయోగపడే పుస్తకం ఈ సంగీత సౌరభం.
పాఠం చెప్పేటప్పుడు ప్రామాణికంగా, ప్రతీ పాటా, స్వరమూ శాస్త్రీయంగా ఒకటికి పలుమార్లు పరీక్షించి స్వర దోషాలు లేకుండా ఇచ్చిన ఈ పుస్తకం గురువులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.
సంగీత సౌరభం లాంటి గొప్ప కార్యాన్ని ఇంతవరకూ ఏ సంగీతజ్ఞుడూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. త్యాగరాజు కీర్తనల మీద, దీక్షితార్ కృతులమీదా విడిగా వచ్చి వుండవచ్చు కానీ అనేకమంది వాగ్గేయకారుల రచనలు ఒకే చోట పదిలపరచడం మాత్రం జరగలేదు. శుద్ధమైన కర్ణాటక సంగీతాన్ని పరిరక్షించాలన్న తపనతో కంకణం కట్టుకుంటే తప్ప ఇలాంటివి సాధ్యపడవు.
*ఎందరోమహానుభావులు అందరికి వందనాలు*
No comments:
Post a Comment